కాంగ్రెస్ (Congress) సర్కార్ పై విశ్వ హిందూ పరిషత్ (VHP), భజరంగ దళ్ (Bajrang Dal) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి. రాజ్యాంగ నిబంధనలను విరుద్దంగా ఒక తీవ్ర వాద సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఎలా కేటాయిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
భారతీయ అస్తిత్వంపై విద్వేషం చిమ్మే తబ్లిగీ జమాతే లాంటి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డాయి. ఈ విషయంపై తెలంగాణ డీజీపీకి వీహెచ్‌పీ, భజరంగదళ్ లు వినతి పత్రాన్ని అందజేశాయి. వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో తబ్లిగీ జమాతే సమావేశాలను జరగనున్నాయని, వాటికి అనుమతి రద్దు చేయాలని డీజీపీని కోరారు.
తబ్లిగీ జమాతే సంస్థపై పలు ముస్లిం దేశాలు నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్బంగా నేతలు గుర్తు చేశారు. ఈ నిషేధం విషయం ప్రభుత్వానికి తెలియదా అని ఫిర్యాదులో ప్రశ్నించారు. హిందూ సంస్కృతిపై విషం చిమ్మే ఇలాంటి సంస్థ వల్ల సమాజానికి చెడు కలగడమే తప్పా ఎలాంటి ప్రయోజనాలు కలగవన్నారు.
ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి విడుదల చేసిన రూ.2 కోట్ల 45 లక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఆ నిధులను వెనక్కి తీసుకోని పక్షంలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.