ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తుండగా.. పార్టీల కీలక నేతలు విజయం తమదేనని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. నిరంకుశ పాలనను తరిమేద్దామని ప్రజలు డిసైడ్ అయి.. కేసీఆర్ (KCR) కు ఓటుతో బుద్ధి చెప్తారని కాంగ్రెస్ (Congress) నేతలు అంటుంటే.. సర్వేలు తారుమారవ్వొచ్చు.. 70 సీట్లలో కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ (BRS) నేతలు చెబుతున్నారు. ఇటు బీజేపీ (BJP) నాయకులు కూడా తమకు స్పష్టమైన ఫలితాలు వస్తాయని ధీమాగా కనిపిస్తున్నారు.
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై ఇప్పటికే మంత్రి కేటీఆర్ (KTR) మండిపడగా.. మరోసారి ఆయన స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతదాకా అయినా వెళ్లొచ్చు, కానీ.. కచ్చితమైన ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే అర్థం వచ్చేలా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని తెలిపారు. ఎన్నికల అంచనాలపై గురువారం స్పందించిన కేటీఆర్.. రబ్బిష్.. న్యూసెన్స్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇటు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కేడర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. గడచిన పదేళ్లుగా పార్టీకి అండగా.. ప్రజల తరఫున నిలబడ్డారంటూ భావోద్వేగానికి గురయ్యారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాదని.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ పాత్ర మరువలేనిదంటూ వారికి అభినందనలు తెలిపారు రేవంత్.
ఆదివారం ఊహించని ఫలితాలు రాబోతున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఎన్నోసార్లు సర్వేలు తారుమారయ్యాయని.. రాష్ట్రంలో మెజారిటీ సీట్లను బీజేపీ సాధించబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హంగ్ చర్చ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేవి ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేసే కుట్రగా చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మంచి మెజారిటీ రాబోతోందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కూడా అధికారంలోకి వస్తామని తెలిపారు. ఇక, నాగార్జున సాగర్ ఇష్యూను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిందని మండిపడ్డారు బండి సంజయ్.