నాగార్జున సాగర్ జల వివాదం ముందు ముందు ఏ పరిస్థితులకు దారితీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మరోవైపు రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పర దాడులు చేసుకోవడం.. కేసులు నమోదు అవ్వడం కూడా జరిగిపోయింది. ఇప్పటికే జల వివాదం మొదలై మూడు రోజులు అవుతున్నా.. ఇంతలో ఈ సమస్యకు పరిష్కారం మాత్రం కనిపించదనే చర్చ నడుస్తుంది.
అయితే తాజాగా నాగార్జున సాగర్ జలవివాదం పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) స్పందించారు.. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దుస్సాహం చేసిందని అన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా సుఖేందర్ రెడ్డి అభివర్ణించారు.
ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నట్టు సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సుఖేందర్ రెడ్డి.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో శ్రీశైలం, తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో నాగార్జున సాగర్ ఉండాలని అన్నారు.
కానీ ఏపీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని సుఖేందర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాగర్‌ను దురాక్రమించడం సరికాదని హితవు పలికారు. మరోవైపు కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్ (KRMB) ఆదేశించిందన్న సుఖేందర్ రెడ్డి.. నీటి విడుదల ఇంకా కొనసాగుతున్నదని, పోలీసులు వెనక్కి వెళ్లలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల సంబంధాలు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని సుఖేందర్ రెడ్డి తెలిపారు..