రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానం తీర్పులను కొందరు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారని మాజీ న్యాయమూర్తులు(Retired Judges) ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా 21మంది సుప్రీం కోర్టు(Supreme Court), హైకోర్టు(High Court)ల మాజీ న్యాయమూర్తులు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Justice DY Chandrachud)కు ఓ లేఖను రాశారు. అందులో తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా తమకు అనుకూలంగా తీర్పు చెప్పాలంటూ తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికమైనవని, దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమని పేర్కొన్నారు. అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలపై ప్రశంసలు, అలా లేకపోతే విమర్శలు చేయడంతో న్యాయ సమీక్ష సారాంశమే దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అవినీతి కేసుల్లో అధికార ఎన్డీయే, విపక్షాల ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాయడం చర్చనీయాశంమైంది. ఇదివరకు ఇలాగే రాజకీయ ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేశంలోని దాదాపు 600 మంది లేఖ రాశారు. స్వార్థ ప్రయోజనాల సమూహాలకు అడ్డుకట్ట వేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
కోర్టులను ప్రభావితం చేయడం సులభం అంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని 600 మంది లాయర్లు తమ లేఖలో కోరారు. రాజకీయ అజెండాతో న్యాయస్థానాలను అగౌరవపరిచే ‘స్వర్ణ యుగం’, ‘బెంచ్ ఫిక్సింగ్’ లాంటి పదాలను ప్రయోగించే వారిని ఉపేక్షించకూడదని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు.