Libya : పొట్టకూటి కోసం ఇండియా నుంచి లిబియా వెళ్లిన 17 మంది యువకులు ఆ దేశంలో నరకం చవి చూశారు. ఆరు నెలలుగా ట్రిపోలీ జైల్లో మగ్గారు. అక్కడ వారిని అధికారులు నానా హింసలూ పెట్టారు. టార్చర్ పెట్టారు. ఇటు ఇండియాకు రాలేక, అటు ఆ దేశం నుంచి తప్పించుకుని రాలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం . హర్యానాకు చెందిన వీరినుంచి 13 లక్షల చొప్పున ఫీజు గుంజిన ఏజెంట్లబారిన పడిన వీరు లిబియాలో జాబ్స్ కాదుకదా కనీసం నిలువనీడక్కుండా నోచుకోలేకపోయారు.
వీరిపై అక్రమ కేసులు పెట్టిన లిబియా ప్రభుత్వం వీరిని జైలుకు పంపింది. మీకు లిబియాలో మంచి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి పంజాబ్, ఢిల్లీకి చెందిన ట్రావెల్ ఏజెంట్లు గత ఫిబ్రవరిలో ఆ దేశానికి పంపారు అక్కడ జువారా సిటీలో తమకు ఆహారం గానీ, నీళ్లు గానీ ఇవ్వకుండా అతి దుర్భర పరిస్థితిల్లో ఉంచారని అన్మోల్ సింగ్ అనే బాధితుడు తెలిపాడు.
మమ్మల్ని ఇటలీ పంపుతామని మొదట చెప్పి.. సముద్ర మార్గం ద్వారా ఈజిప్ట్ కు, అక్కడినించి చివరకు లిబియాకు చేర్చారని, అక్కడ లోకల్ మాఫియాకు అమ్మేశారని ఆయన చెప్పాడు. మేము కూలీలుగా పని చేయాల్సి వచ్చింది. నిరాకరించిన వారిని గొడ్డును బాదినట్టు బాదేవారు. అని వెల్లడించాడు.
మాఫియా నుంచి తప్పించుకున్న తమను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ లిస్ట్ లో పెట్టి జైలుకు పంపారన్నారు. చివరకు పంజాబ్ కు చెందిన రాజ్యసభ ఎంపీ విక్రమ్ జిత్ సింగ్ సాహ్నే చొరవతో వీరు లిబియా కబంధ హస్తాల నుంచి బయట పడ్డారు. ఆదివారం ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగిన తమవారిని చూడగానే వీరి ఆప్తులు ఆనంద భాష్పాలతో వారిని కౌగలించుకుని తమ ఇళ్లకు తీసుకువెళ్లారు.