విపక్ష ఇండియా కూటమి (India Alliance)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar)వైదొలిగారు. నితీశ్ కుమార్ తన సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)స్పందించారు.
ఈ సంగతి తమకు ముందే తెలుసని వెల్లడించారు. దేశంలో ‘ఆయారామ్- గయారామ్’లు చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతకు ముందు నితీశ్ కుమార్, తాను కలసి పోరాటం చేశామని వెల్లడించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్తో తాను మాట్లాడానని పేర్కొన్నారు.
కూటమి నుంచి నితీశ్ వెళ్లిపోతున్న విషయాన్ని వాళ్లు చెప్పారని తెలిపారు. ఒక వేళ ఆయనకు ఇక్కడే కొనసాగాలని ఉంటే ఇక్కడే ఉండేవారని వివరించారు. కానీ, ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. అందుకే వెళ్లిపోయారన్నారు. ఆ విషయం తమకు ముందే తెలుసని తెలిపారు.
ఇండియా కూటమిని తాము యదాతథంగా కొనసాగించాలని అనుకున్నామని చెప్పారు. అందుకే తాము ఏదైనా విషయాన్ని చెబితే మిత్ర పక్షాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్ కూడా ఇదే విషయాన్ని తమకు చెప్పారని చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజు అదే రుజువైందన్నారు.