తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మీరంటే మీరు దోపీడీ దొంగలు అంటూ అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) నేతలు ఆరోపించుకుంటున్నారు.మొన్నటివరకు కాళేశ్వరం(Kaleshwaram)లో ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్ష కోట్ల అవినీతి(Curruption)కి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఒక్క కాళేశ్వరంలోనే కాకుండా ధరణి పోర్టల్, కోకాపేట భూముల వేలం, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, మిషన్ భగీరథ ఇలా కేసీఆర్ ప్రవేశ పెట్టిన అన్ని స్కీముల్లోనూ అవినీతి దాగుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి(CM revanth reddy)కి రూ.3వేల కోట్ల భూ దందాతో సంబంధం ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కంటోన్మెంట్ కీలక నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) ఆరోపించారు.
గురువారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. చిత్రపురి సొసైటీలో రూ.3వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య సంబంధం ఉందని ఆరోపించారు.
దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. తన వద్ద ఉన్న ఆధారాలు తప్పని కోర్టుకు వచ్చి నిరూపించగలరా? అంటూ క్రిశాంక్ సవాల్ విసిరారు. దీని విషయంలో తాను హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడికి రమ్మన్నా వస్తానని మన్నె క్రిశాంక్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే తమ మీద కేసులు పెట్టడంతో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కుంటున్నారని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తంచేశారు.