Telugu News » Soniya Gandhi: కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర: సోనియా గాంధీ

Soniya Gandhi: కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర: సోనియా గాంధీ

ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఎల‌క్టోర‌ల్ బాండ్ల విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అసాధార‌ణ‌మైన‌వ‌ని, అప్ర‌జాస్వామిక‌మైన‌వ‌న్నారు.

by Mano
Soniya Gandhi: Conspiracy to hurt Congress financially: Sonia Gandhi

కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోడీ(PM Modi) ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ (Soniya Gandhi) ఆరోపించారు. ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఎల‌క్టోర‌ల్ బాండ్ల విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అసాధార‌ణ‌మైన‌వ‌ని, అప్ర‌జాస్వామిక‌మైన‌వ‌న్నారు.

Soniya Gandhi: Conspiracy to hurt Congress financially: Sonia Gandhi

బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు బీజేపీకి వేల కోట్ల రుపాయల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. బాండ్స్ ద్వారా బీజేపీకి 56శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్‌కు 11శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయని తెలిపారు. అక్రమంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఓ వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తోందంటూ మండిపడ్డారు. చాలా విప‌త్క‌ర ప‌రిస్థితులు, స‌వాళ్ల మ‌ధ్య త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని సోనియా తెలిపారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లు రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ద‌న్నారు.

అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఫండ్స్‌ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సీతారామ్ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పడు నోటీసులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకుని తీవ్ర చర్యలు చేపడుతున్నారని ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి చర్యలు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం బతకడం కష్టమని అసహనం వ్యక్తం చేశారు.

నెల రోజులకు పైగా తమ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో తమ ఖాతాల్లోని రూ.285కోట్లను వాడుకోలేకపోతున్నామని తెలిపారు. ఏ పార్టీకి లేని నిబంధనలన్నీ కాంగ్రెస్ కే వర్తిస్తాయా? అంటూ ప్రశ్నించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తమ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం దారుణమని అన్నారు. నిధులు వాడుకోలేకపోతే తాము ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

అదేవిధంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి చేస్తున్న నేరపూరిత చర్యగా అని ఆరోపించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమేనని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ తమ నేతలను ఎక్కడికీ పంపలేకపోతున్నామన్నారు. ‘‘విమాన ప్రయాణాలు పక్కన పెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికైనా మా వద్ద డబ్బుల్లేవు’’ అని రాహుల్ అన్నారు. ఎన్నికల్లో తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారని, ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment