జనవాసాలకు దగ్గరలో ఉన్న క్రషర్ కంపెనీల (Crusher Companies) వల్ల స్థానికంగా ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా గూడూరు (Gudur) మండలంలోని క్రషర్‌లో ఏర్పాటు చేసిన బాంబుల బ్లాస్ట్ కలకలం రేపాయి. గాజుల గట్టు శివారులో ఉన్న క్రషర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా బాంబు బ్లాస్టులు చేయడంతో.. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నట్టు సమాచారం..
క్రషర్‌లో ఏర్పాటు చేసిన బాంబుల బ్లాస్ట్ వల్ల వెలువడుతోన్న భారీ శబ్దానికి రాళ్లు ఇండ్ల మీద పడి ఇండ్లు దెబ్బ తింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తోన్నారు. జరుగుతోన్న నష్టానికి బాధ్యులు ఎవరంటూ వాపోతోన్న గాజుల గట్టు గ్రామస్థులు క్రషర్ కు తాళం వేసి ధర్నా నిర్వహించినట్టు సమాచారం.. క్రషర్ నిర్వాహకులు సమయ పాలన లేకుండా, వారి ఇష్టనుసారంగా బాంబులు బ్లాస్ట్ చేస్తుండటం వల్ల.. చుట్టూ పక్కల ఉన్న రైతుల పొలాలు మరియు ఇండ్లు దెబ్బ తింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
ఈ విషయాన్ని ఎన్ని సార్లు క్రషర్ నిర్వాహకుల దృష్టికి తీసుకు వెళ్ళిన.. వారు మాత్రం అలాగే వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు మరియు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి అయిన సంబంధిత శాఖ అధికారులు స్పందించి క్రషర్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు..
మరోవైపు క్రషర్ నిర్వహించుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నట్టు యాజమాన్యం చెబుతోంది. కాగా నెక్కొండ రహదారి పక్కనే క్రషర్ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయంతో ఆ దారిలో ప్రయాణించారు. బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ధూళి, దుమ్ముతో గాజులగట్టు గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీంతో గాజులగట్టు గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు..