లోక్‌సభ ఎన్నికలను (Lok Sabha Polling) పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(Telangana CEO Vikas Raj) మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈవీఎం(EVM)లను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు.
రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయని తెలిపారు. వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం అనుమతించాయని తెలిపారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 60 వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు పక్క రాష్ట్రాల నుంచి 20వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 35,808 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియను సాయంత్రం 4గంటలకే పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమయాన్ని పెంచాలని పలు రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయన్నారు. వాటిని ఎన్నికల సంఘానికి పంపించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవేయొచ్చని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలు ఉన్నాయని ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అక్కడి లోక్‌సభ స్థానాలకు రెండు దశల పోలింగ్ పూర్తి అయిందని, ఆ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్ల 375 కంపెనీల సాయుధ బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం 155కంపెనీల సాయుధబలగాలు చేరుకున్నాయని, మరో 50కంపెనీలను కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.