– మల్కాజిగిరి పార్లమెంట్ సీట్ కన్ఫర్మ్!
– యోగానంద్ ను కలిసిన కార్యకర్తలు, అభిమానులు
– వేలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు
– అసెంబ్లీ సీటు దక్కకపోవడంపై భావోద్వేగం
– కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు
– పార్టీ నిర్ణయం శిరోధార్యమని ఓదార్చిన యోగానంద్
– బీజేపీ గెలుపే మన ధ్యేయమని పిలుపు
తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) లో పార్టీనే నమ్ముకున్న నేతల్లో గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) ఒకరు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి (Serilingampalli) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతగా బాగోలేకపోయినా.. తనకున్న ఇమేజ్ తో బీజేపీ బలోపేతానికి కష్టపడ్డారు. అప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ.. ఇంకోవైపు ప్రజా సమస్యలపై పార్టీ తరఫున పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి ఆయనకు అసెంబ్లీ టికెట్ దక్కలేదు. దీంతో నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న యోగానంద్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన్ను కలిసి భావోద్వేగానికి గురయ్యారు కార్యకర్తలు. వేలాదిగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారిని ఓదార్చిన యోగానంద్.. సెంట్రల్ పార్టీ నిర్ణయం ఏదైనా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అది మనకు శిరోధార్యమని చెప్పారు. తనపై నమ్మకంతో మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ భాగస్వామ్యం, మీ నిబద్ధత, మీ నమ్మకం మాత్రమే ఈ ప్రయాణాన్ని ముందుండి నడిపించాయని చెప్పారు.
కార్యకర్తలు, అభిమానులు అందించిన ప్రోత్సాహం.. పార్టీని బలోపేతం చేయడమే కాకుండా వ్యక్తిగతంగా తనకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు యోగానంద్. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు, సానుకూల, స్థిరమైన మార్పును తీసుకురావడానికి అందరం సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాల్లో అర్ధవంతమైన మార్పును తీసుకురావడానికి అవిశ్రాంతంగా పని చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై ఉన్న అచంచల విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఉత్సాహంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని.. దీనికి నిరంతరమైన మీ మద్దతు ఉండాలని కోరుతున్నట్టు బీజేపీ కార్యకర్తలు, అభిమానులను కోరారు యోగానంద్.
శేరిలింగంపల్లిలో బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డ యోగానంద్ కు టికెట్ దక్కకపోవడంపై అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే.. ఆయనకు లోక్ సభ సీటు హామీ దొరికినట్టు తెలుస్తోంది. ఉన్నతమైన ఆలోచనలు, విలువలు ఉన్న యోగానంద్ ను జాతీయ స్థాయిలో పార్టీకి వాడుకోవడానికి హైకమాండ్ నిర్ణయించినట్టు.. అందుకే అసెంబ్లీ నుంచి కాకుండా పార్లమెంట్ కు పంపాలని డిసైడ్ అయినట్టు సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్ స్టానం నుంచి యోగానంద్ ను బరిలోకి దింపాలని అధిష్టానం చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.