ఏపీ సీఎం(AP CM) జగన్(Jagan)పై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రజాగ్రహానికి గురైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పరారీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైసీపీ నావను ఏ శక్తీ అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.
వైసీపీలో ఓటమి భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు లోకేశ్. 2024 ఎన్నికలకు ముందే వైసీపీ అభ్యర్థుల్లో సన్నగిల్లిన విశ్వాసానికి తాజా ఉదాహరణలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. ప్రస్తుత 35 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ సొంత స్థానాల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారని వినిపిస్తోందన్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదు.. అందరినీ సమానంగా చూడాలని క్రిస్మస్ రోజున జగన్ సందేశం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్ చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు.
తమ అందరిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఆయన నైజమంటూ మండిపడ్డారు. జాతీయ రహదారి పక్కన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీ పేర్లతో మంత్రి కాకాణి దోచుకుంటున్నారని ఆరోపించారు. వెంకటాచలంలో తహసీల్దారుగా పనిచేసిన ప్రసాద్ అనే అధికారి రికార్డులను మార్చేశారని, గ్రామ సభలు పెట్టకుండా పట్టాలు ఇచ్చారని విమర్శించారు. భూములకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో అధికారులు ప్రదర్శించాలని, లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.