పశ్చిమ గోదావరి (West Godavari)జిల్లా, ఉండి మండలం, చెరుకువాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కాగా ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతోన్నారు.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి, గన్‌మెన్‌కి కూడా గాయాలు అయినట్టు సమాచారం.. అయితే ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (MLC Shaik Sabji) మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎమ్మెల్సీ మరణవార్త తెలుసుకొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఈ వార్త తెలియడంతో కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు..
ఇక ఈ ప్రమాద ఘటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలిలో వినిపించే ప్రజా గొంతు మూగబోయిందన్న లోకేష్.. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీ అని గుర్తు చేశారు.. ఎమ్మెల్సీ కి నివాళులర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.