నేషనల్ కాన్ఫరెన్స్ (National Conferance) చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రా మమందిరం ప్రారంభోత్సవానికి రెడీగా ఉందన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్టు తెలిపారు.
శ్రీ రాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందిన వారు కాదని, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీ రాముడు దేవుడేనని పేర్కొన్నారు. సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని సందేశాన్ని శ్రీరాముడు ఇచ్చారని చెప్పారు.
కుల, మతాలతో సంబంధం లేకుండా అణగారిన వర్గాల వారిని ఉద్దరించాలని ఈ ప్రపంచానికి సందేశం ఇచ్చారన్నారు. ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రెడీగా ఉందన్నారు. దేశంలో సోదరభావం క్షీణిస్తోందన్నారు. ఆ సోదరభావాన్ని మళ్లీ పునరుద్దరించాలని ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాని చెప్పారు.
అయోధ్యలో జనవరి 22న ‘రామ్ లల్లా’విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తాజాగా అయోధ్యలో రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.