వారంతా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు(IIIT Students). సెలవు రోజు సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి(Beach) వెళ్లారు. సముద్ర నీటిలోకి దిగి అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొంతసేపటికే రాకాసి అలలు వారి ఆనందంపై నీళ్లు చల్లాయి.
ఐదుగురు విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయారు. దీంతో మెరైన్ పోలీసులు వారి ప్రాణాలను అడ్డుపెట్టి నలుగురి యువకుల ప్రాణాలను కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో మరో యువకుడు గల్లంతయ్యాడు. మచిలీపట్నం(Machilipatnam)లోని సముద్ర తీరంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదివుకునే తోకల అఖిల్ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఇవాళ మచిలీపట్నం వెళ్లాడు. స్నేహితులంతా కలిసి తాళ్ళపాలెం బీచ్‌లో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. నీటిలోకి దిగిన ఐదుగురు యువకులను అలలు సముద్రపు లోతుల్లోకి లాక్కెల్లిపోయాయి.
అలల తాకిడికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోవడం గమనించిన మెరైన్ పోలీసులు నలుగురికి కాపాడారు. కానీ అఖిల్‌ను మాత్రం రక్షించలేకపోయారు. అతడి కోసం ఎంత ప్రయత్నించినా జాడ కనబడలేదని మెరైన్ పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.