మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు మంచి నిద్రలో ఉండటంతో 13 మంది సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు.
బస్సు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.