మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయాలపాలైన వారిలో తొమ్మిది మంది పురుషులు, 12మంది మహిళలు ఉన్నారు. వీరందరిదీ అమ్హై డియోరి గ్రామం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగింది. బాధితులు దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్లో ఉన్న అమ్హాయి దేవీ గ్రామంలో జరిగిన శ్రీమంతం వేడుకకు హాజరై సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మృతులను పున్ను లాల్(55), బాబు లాల్ ఆర్మో (40), సెమ్ బాయి (40), కిర్పాల్ (45) పితం(16), మహదీ బాయి (35), లాల్ సింగ్ (55), ములియా మదన్ సింగ్(60), టిత్రి బాయి (50), సావిత్రి (55), సర్జు (45), సంహర్ (55), మహా సింగ్ (72), లాల్ సింగ్ (27)గా గుర్తించారు. కాగా, ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించారు.