రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి 400లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ (PM Modi) మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి 400లకు పైగా స్థానాలు సాదిస్తే అందులో ఒక్క బీజేపీ (BJP)కే 370కి పైగా స్థానాలు వస్తాయని తెలిపారు. ఆ టార్గెట్ ఎలా సాధించాలో మీకు చెబుతానని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ అన్నారు.
మధ్య ప్రదేశ్‌లోని జబువాలో నిర్వహించిన జన జాతీయ మహాసభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. అదేమీ పెద్ద కష్టమైన పనేమీ కాదని, దాన్ని ఎలా సాధించాలో చెబుతానన్నారు. మొదట పోలింగ్ బూత్ జాబితాలను తయారు చేయాలని, అందులో గత మూడేండ్లలో ఏయే పోలింగ్ బూత్‌ల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయో గుర్తించాలని సూచించారు.
ఆయా పోలింగ్ బూత్‌ల్లో ఈ సారి కొత్తగా మరో 370 ఓట్లు టార్గెట్ పెట్టుకోవాలని సూచనలు చేశారు. పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలని… మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టుల గురించి వారికి వివరించాలని కోరారు. అలా చేస్తే 370 స్థానాల్లో విజయం సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదన్నారు. ప్రజా సేవకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి పనులు రెట్టింపు వేగంతో దూసుకు పోతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు. తాను ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు రాలేదని, కేవలం ప్రజలకు సేవ చేసేందుకు తాను వచ్చానని వివరించారు. గిరిజన కమ్యూనిటీ తమకు ఓటు బ్యాంకు కాదని, దేశానికి గర్వకారణమని ప్రశంసించారు.