రైతులు వ్యవసాయ పనులకు ఎక్కువగా సాధు జంతువులను పెంచుతుంటారు. ఆవులు, గేదెలు, ఎద్దులను పెంచుకుంటూ వాటి ఆధారంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వాటిని ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా భావించి అమితమైన ప్రేమను చూపిస్తారు. అయితే, మధ్యప్రదేశ్(Madyapradesh)లోని మందసౌర్(Manda saur)లో ఓ రైతుకు చెందిన కాడెడ్లు మృత్యువాతపడగా ఆ రైతు కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.
మనుషులకు చేసినట్లుగానే పూర్తి కర్మలను చేశాడు వాటి యజమాని. అంతేకాదు.. ఆ ఎద్దుల అస్థికలను గంగలో కలిపాడు. ఒక పత్రికనూ ముద్రించాడు. 12 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించారు. ఈ క్రతువులన్నీ పూర్తి చేసి, ఎద్దులకు తండ్రి హోదా కల్పించి, పిండదానం కూడా చేశాడు. మందసౌర్‌లోని భాన్పురాలోని బాగ్ని ఖేడా గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
భవానీ సింగ్, ఉల్ఫత్ సింగ్‌లకు చెందిన ఒక ఎద్దు డిసెంబర్ 14న, మరో ఎద్దు రెండు రోజుల తర్వాత డిసెంబర్ 16న మృత్యువాతపడ్డాయి. దీంతో భవానీ, ఉల్ఫత్ సింగ్ కుటుంబీకులు సనాతన్ సంప్రదాయం ప్రకారం 12రోజులపాటు సంతాప దినాలు పాటించారు. హిందూ ఆచారాల ప్రకారం.. సోదరులిద్దరూ ఆ ఎద్దులను ఖననం చేసి, వాటి అస్థికలను గంగలో నిమజ్జనం చేశారు. గంగా ఘాట్ నుంచి తిరిగి వచ్చిన తరువాత 12 రోజుల సంతాప దినాలు తర్వాత పత్రికను ముద్రించి పెద్దకర్మను నిర్వహించారు.
గ్రామస్తులకు, బంధువులకు ఆహ్వానాలు పంపారు. రైతు భవానీ సింగ్ మాట్లాడుతూ.. ఈ కాడెడ్లను చిన్నప్పటి నుంచి అపురూపంగా పెంచుకుంటున్నామని తెలిపాడు. తాము కష్టాల్లో ఉన్న సమయంలో వ్యవసాయ పనుల కోసం వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అవి తమ ఇంట్లోకి వచ్చి సిరిసంపదలు తెచ్చిపెట్టాయని, తమ వ్యవసాయ విస్తీర్ణం 50 బిఘాలకు పెరిగిందని, ట్రాక్టర్, జేసీబీ కొన్నామని తెలిపాడు. అందుకే వాటిపై తమకు అమితమైన ప్రేమ అని చెప్పాడు.