మహబూబ్‌నగర్ (Mahabubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో, ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా నేడు ఈ స్థానం భర్తీకి నిర్వహించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC by election) ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఏఆర్వో తెలిపారు.. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారని తెలుస్తోంది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం కొడంగల్ (Kodangal) ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఇక ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదేవిధంగా మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటు ఈ ఎన్నికల్లో ఉంటుంది. అయితే మొత్తం పోలైన ఓట్లలో, మొదటి ప్రాధాన్యత ఓట్లను తొలుత లెక్కిస్తారు.
పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా, ఆ అభ్యర్థి మొదటి రౌండ్‌లో విజయం సాధించినట్లని తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. కాగా ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే హస్తం గెలిచే అవకాశాలున్నట్లు చర్చించుకొంటున్నారు..