హిందూస్థానీ అవామ్ మోర్చా (HAM)చీఫ్ జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi)కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్లోని అధికార మహా కూటమి ఇంకెంతో కాలం మనుగడ సాగించదని అన్నారు. తన మాజీ మిత్రుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటనలు విన్న తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తాను ముందే పసిగట్టానన్నారు.
బిహార్ రాజకీయ వాతావరణం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదన్నారు. మీరందరూ చూస్తున్నారు…. వంశ పారంపర్య రాజకీయాలపై నితీశ్ కుమార్ చేసిన ప్రకటన కాంగ్రెస్, ఆర్జేడీలను ఉద్దేశించి చేసిందని వివరించారు. ఈ పరిస్థితుల్లో వారు ఐక్యంగా ఉంటారని మీరు భావిస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. ఆర్జేడీపై నితీశ్ కుమార్ వ్యాఖ్యల ప్రకారమే మహా ఘట్ బంధన్ ఎంతోకాలం ఉండదని చెప్పామని పేర్కొన్నారు.
‘ముఖ్య మంత్రి పదవిని వదులుకునేందుకు నితీశ్ కుమార్ ఎప్పుడూ ఇష్టపడరు. పీఎం కావాలనుకున్న ఆయన ఆశలు ఇప్పుడు చెల్లాచెదురయ్యాయి. బిహార్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం. మహ కూటమితో తెగ తెంపులు చేసుకున్న తర్వాత లోక్ సభ ఎన్నికలకు నితీశ్ కుమార్ ఒంటరిగానే వెళ్లవచ్చు. లేదంటే ఇతర కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది’అని పేర్కొన్నారు.
కానీ సహజంగా సీఎం పదవి విషయంలో నితీశ్ ఎప్పుడూ రాజీపడరని చెప్పారు. సీఎంగా నితీశ్ కుమార్ను మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అంగీకరిస్తుందా, లేదా అనేది తాము చెప్పలేమన్నారు. మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో, 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తుందని హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) ఉంటుందని మాంఝీ రాజకీయ సలహాదారు డానిష్ రిజ్వాన్ అన్నారు.