మహారాష్ట్ర (Maharashtra)లో తుపాకి గర్జించింది. ఫలితంగా ఈ ఘటనలో శివసేన (Shiv Sena) నేతకి తీవ్ర గాయలైనట్లు సమాచారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి చెందిన శివసేన నేతపై, బీజేపీ (BJP) ఎమ్మెల్యే కాల్పులకు దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శివసేన నేత మహేశ్ గైక్వాడ్ (Mahesh Gaikwad), బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ (Ganpat Gaikwad)తో పాటు వారి మద్దతుదారులు.. గత కొద్దికాలంగా ఉన్న ఓ స్థలం వివాదానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో.. ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్.. శివసేన నేత మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా.. అతను తీవ్రంగా గాయపడినట్లు పార్టీ వర్గాల సమాచారం.
మరోవైపు ఈ కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్‌కి సైతం గాయలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు.. గాయపడిన వారిని థానేలోని జూపిటర్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు కారణమైన గణ్‌పత్ గైక్వాడ్‌ను పోలీసులు అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొన్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు.
మరోవైపు కాల్పుల్లో గాయపడ్డ మహేశ్ గైక్వాడ్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సంఘటన గురించి తెలుసుకొన్న శివసేన మద్దతుదారులు ఆస్పత్రి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక ఆత్మరక్షణ కోసం నేతలు తీసుకొనే తుపాకులు.. ఇలా ఆవేశంలో పేలడం వల్ల ఎందరివో ప్రాణాలు పోతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.