తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేతల ఆశల పై నీళ్ళు చల్లుతున్నాయని వివిధ పార్టీల నేతలు ఆగం ఆగం అవుతున్నారు. రాష్ట్రంలో ఏదో మూల నుంచి అయినా టికెట్ దక్కుతుందని బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS)నేతలు ఆశించారు.. కానీ వారి ఆశలు కలగా మిగిలిపోవడంతో జోరుగా జంపింగ్‌లకు తెరలేపారు. అసంతృప్తులంతా టికెట్ రాలేదని ఇతర పార్టీల్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు జడ్చర్లలో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎర్రశేఖర్ హస్తం పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా బరిలో ఉంటానని ప్రకటించిన ఎర్రశేఖర్.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.. బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని నిరాశ చెందిన బీజేపీ మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ సైతం బీఆర్ఎస్లో చేరారు.
మరోవైపు వనపర్తి బీఆర్ఎస్ నాయకుడొకరు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లోని అసంతృప్త నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాయకుల పార్టీ మార్పులు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదని.. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు..కాంగ్రెస్ బాట పట్టే అవకాశం కనిపిస్తోందని పాలమూరు జిల్లా రాజకీయాల్లో చర్చలు మొదలైనట్టు సమాచారం..
ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నాయకుల వలసలు పాలమూరు రాజకీయాలను ఆగం ఆగం చేస్తున్నాయని కార్యకర్తలు ఆందోళన పడుతున్నారని, అయోమయానికి గురవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు నామినేషన్ల పర్వం తుదిఘట్టానికి చేరుకునే వరకూ, కీలక నేతల వలసల పర్వం కొనసాగే అవకాశం ఉందన్నట్టు ప్రచారం జరుగుతుంది..