మహబూబ్‌నగర్ (Mahbubnagar) నుంచి కాంగ్రెస్ (Congress) పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. పాలమూరు (Palamuru) ప్రజాదీవెన సభతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రజాదీవెన సభ కోసం ఇప్పటికే సీఎంను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మార్చ్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు మహబూబ్‌నగర్, MVS కాలేజీ మైదానంలో భారీగా పాలమూరు ప్రజా దీవెన సభను నిర్వహించనున్నారు. కాగా కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తున్నారు. ఇక మార్చి 6న జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు న్యాయ యాత్ర చేపడుతుంది. ఈ ముగింపు సభకు ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ ని మహబూబ్ నగర్ శాసనసభ్యుల బృందం ఆహ్వానించింది. ఇటీవలే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసి, సంగంబండ బాధితులకు ప్రభుత్వం 11 కోట్ల పరిహారం విడుదల చేసింది.
ఐదు వేల కోట్ల నిధులు కొడంగల్ కు కేటాయించింది.. అయితే మార్చ్ 6 నిర్వహించే సభలో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని అభివృద్ధి వరాలు ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. ఇక రేవంత్ ను కలిసిన వారిలో వంశీచంద్ రెడ్డి, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఉన్నారు.