మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి(MLC Mahender Reddy) దంపతులు బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి దంపతులు గురువారం తమ కుమారుడితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ అంశం రంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
2018 ఎన్నికల్లో మహేందర్‌రెడ్డిపై తాండూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాలతో వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో పట్నం దంపతులు చేరతారని కథనాలు వచ్చినా చివరి మూడు నెలల సమయంలో మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్‌లోనే కొనసాగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడటం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీకి సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈనెల 11న సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకు షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి ఉంది. మొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నిన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నేడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడానికి సిద్ధమయ్యారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ వలసలను కట్టడి చేయడానికి గులాబీ బాస్ ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.