భారత్ నిర్మాణంలో నెహ్రూ (Nehru) దూరదృష్టి అమోఘమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud). స్వాతంత్ర్యం, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ (BJP).. ఇవాళ కేవలం పటేల్ నే ఆకాశానికెత్తడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. నెహ్రూ, పటేల్ (Patel) సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.
బ్రిటిష్ వాళ్ల నీతిని బీజేపీ అనుసరిస్తోందన్న మహేష్ కుమార్.. ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పటేల్ ప్రజా నాయకుడని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అని గుర్తు చేశారు. గుండు సూది తయారుకాని దశ నుంచి రాకెట్ పంపించే స్థాయి వరకు భారత్ ఎదిగిందంటే.. దాని వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉందని వివరించారు.
1981లో పుట్టిన బీజేపీకి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హతే లేదన్న ఆయన.. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. విజయభేరి సభ విజయం చూసి బీజేపీ, బీఆర్ఎస్ లకు భయం పట్టుకుందని చురకలంటించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏ మంత్రికీ స్వేచ్ఛ లేదన్నారు. మహిళా బిల్లును తాము స్వాగతిస్తున్నామని.. ఇది కాంగ్రెస్ (Congress) మానస పుత్రిక అని తెలిపారు. ప్రపంచంలో అవినీతి సామ్రాట్ కేసీఆర్ (KCR) అని.. తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకున్నారని ఆరోపించారు. 2004కు ముందు కేసీఆర్, కవిత, హరీష్ రావు ఆస్తులు ఎంత.. ఇప్పుడెంత? అని ప్రశ్నించారు.
ఇక రజాకార్ సినిమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. రజాకార్ ఫైల్స్ తో ఏం చేసుకుంటారని అన్నారు. రజాకార్లు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ఉన్నాయా? అని అడిగారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని.. ఎన్ని రెచ్చగొట్టే సినిమాలు తీసినా.. శాంతిభద్రతలను దెబ్బతీయలేరని హెచ్చరించారు మహేష్ కుమార్ గౌడ్.