టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆర్ఎస్ఎస్తో ప్రయాణం చేశాకే ఇతర పార్టీలో చేరారని హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్లోకి మారారు అని మంత్రి మహమ్మూద్ అలీ ఆరోపించారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి మిస్ గైడ్ చేశారంటూ విమర్శించారు. 50 ఏళ్లు పరిపాలించి కూడా మైనారిటీల విద్య కోసం నిధులు కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మత కల్లోలం కూడా జరుగలేదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్- టీడీపీ ప్రభుత్వాలు మత వివాదాలపై ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ పండగకు రెండు రోజులు సెలవు ఇస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విద్య పేదవారికి అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి మంచి విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో చాలా మంది సీఎంలు ఉన్నారని, బీఆర్ఎస్ లో మాత్రం ఒక్కరే సీఎం ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. తన మాటలను కొంత మంది వక్రీకరించారని, ఎవరైనా బాధ పడితే తప్పుగా అర్థం చేసుకోకుండా క్షమించాలన్నారు.