అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)సంచలన విషయాలు వెల్లడించింది. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యే (MLA)ల్లో 61 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేలకు గాను 72మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం….. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉంది.
పార్టీల పరంగా చూస్తే అత్యధికంగా అధికార బీఆర్ఎస్లో 101మంది ఎమ్మెల్యేల్లో 59 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏఐఎంఐఎం ఎమ్మెల్యేల్లో ఏడుగురిలో ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక కాంగ్రెస్లో ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను నలుగురిపై, బీజేపీలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఇక 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఇద్దరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు, ఆ తర్వాత నిర్వహించిన ఉప ఎన్నికల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్టు ఏడీఆర్ పేర్కొంది.