ఎన్నికలు వచ్చాయంటే వ్యాపారాలు చేసుకొనే వారికి పండగే.. వ్యాపారస్తుల అందరికి కాదండోయ్.. ఇక ఎన్నికల్లో జెండాలకు, కండువాలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎక్కడ చూడు పార్టీల జెండాలు దర్శనమిస్తాయి. నేతల మెడల్లో కండువాలు కనిపిస్తాయి. మరి ఇన్ని లక్షల జెండాలు, కండువాలు ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారనే ఆసక్తి కలుగుతోంది కదా !.. కాగా వీటిని తయారు చేసేది తెలంగాణ (Telangana)లో ఉన్న రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో..
చుట్టు పక్కల రాష్ట్రాల్లో.. ఏ పార్టీ జెండా (Parties Flags) ఎగరాలన్నా ఇక్కడ తయారు చేయాల్సిందే. ఇప్పుడు ఏకంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు (Five States Elections)ఉండటంతో.. సరిహద్దులు దాటి ఆయా పార్టీలు.. జెండాల తయారీ కోసం సిరిసిల్లకు తరలివస్తున్నాయి. జెండాలు తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తుండడంతో పార్టీల నుంచి ఆర్డర్లు ఊపందుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ రాకపోయినా ముందస్తుగా ఆర్డర్లు వస్తుండటంతో తయారీదారులు.. తీరిక లేకుండా గడుపుతున్నారు.
మరోవైపు సిరిసిల్లలో జెండా తయారీదారులు 15 మంది వరకు ఉన్నారు. వీరికి రోజుకు 50,000 నుంచి 75,000 వరకు జెండాలు తయారు చేసే సామర్థ్యం ఉంది. ఒక్కొక్కరి వద్ద 100 నుంచి 200 మంది కార్మికులు పనిచేస్తుండగా.. పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో ఒక్కో ప్రధాన పార్టీ నుంచి దాదాపు 15 లక్షల వరకు జెండాలు, కండువాలు రూపొందించేలా.. ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు.
త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం (Election) తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 5 లక్షల జెండాలు ఉత్పత్తి చేయబోతున్నామని తయారీదారులు చెబుతున్నారు.. చాలా మంది ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వీటిని తయారు చేసేందుకు కావాల్సిన సిబ్బంది అందుబాటులో లేరని వాపోతున్నారు. మరోవైపు బీడీల తయారీతో గతంలో రోజుకు రూ.100 నుంచి రూ.150కి మించి ఆదాయం లభించక పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని ఇక్కడి కార్మికులు తెలుపుతున్నారు. జెండాల తయారీతో దొరికే ఉపాధి కొద్ది రోజులు మాత్రమే లభిస్తుందని ఆవేదన పడుతున్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగే కంటే వేర్వేరుగా ఎన్నికలు జరిగితేనే పని దొరుకుతుందని అంటున్నారు కార్మికులు..