దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఎలాగైనా ఈ నియోజకవర్గంలో జెండా పాతాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు.
అయితే, ఇప్పటికే మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala rajender)పేరును అధిష్టానం ఖరారు చేసింది. బీఆర్ఎస్ సైతం రాగిడి లక్ష్మారెడ్డి(Laxma reddy) పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో వీరిద్దరిని ఢీకొట్టే బలమైన నేత కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వెతుకులాట ప్రారంభించింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. మల్కాజిగిరి నుంచి చాలా మంది ఆశవహులు ఎదురుచూస్తున్నారు. కానీ, వారిలో ఎవరూ బీజేపీ క్యాండిడేట్ ఈటలను ఢీకొట్ట గలరా? అని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, ఎల్భీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని చూస్తోంది. అయితే, సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ప్రయత్యాన్ని విరమించుకుంది. మొన్నటివరకు సినీ నటుడు అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ, ఇటీవల రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది.
ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగర్ కర్నూల్ మాజీ మంత్రి మర్రి జనార్దన్ రెడ్డి, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పోటీలో ఉంటారని టాక్ వినిపిస్తుండగా తెపైకి మరో కొత్త పేరు వినిపిస్తోంది. గత వారం రోజులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
దీంతో త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, మల్కాజిగిరి ఎంపీ బరిలో మల్లారెడ్డి లేదా ఆయన కొడుకు భద్రారెడ్డి నిలబడుతారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే,మర్రి జనార్దన్ రెడ్డి కూడా మల్కాజిగిరి సీటు తనకు ఇవ్వాలని హైకమాండ్ లెవల్లో లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, బీఆర్ఎస్ నుంచి కొందరు కీలక నేతలు హస్తం పార్టీలో చేరాక మల్కాజిగిరి సీటుపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. అయితే, ఎంపీ అభ్యర్థిని ఫైనల్ చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డిపైనే హైకమాండ్ పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.