తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. కేసీఆర్ సర్కార్ కు ఈ టర్మ్ లో ఇవే చివరి సమావేశాలు. ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉంటాయి. గత ఎన్నికల ఓటింగ్ 2018లో డిసెంబరు 7న జరిగింది. ఈసారి కూడా డిసెంబర్ 7న ఎలాంటి పండుగలు లేకపోతే అదే రోజు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేకపోతే, రెండు రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఈసారి చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వార్ కి దిగాయి అధికార, విపక్ష పార్టీలు.
సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. తన అసెంబ్లీ సెగ్మెంట్ లో టికెట్ పై స్పందించిన ఆయన.. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా పోటీ చేయాలో తానే డిసైడ్ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే చూసుకుంటానని అన్నారు.
గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డికి తానే టికెట్ ఇప్పించానని చెప్పారు మల్లారెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు దోస్తులు ఉన్నారని.. బీజేపీ, కాంగ్రెస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప వేరే సబ్జెక్టు లేదని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోయేలా చేయాలనే కుట్రలు చేస్తున్నారని.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ అంటే మల్లారెడ్డి పోస్ట్ ఉడుతుంది అనే ప్రచారం కూడా చేశారని అన్నారు. అయితే.. రేవంత్ రెడ్డిపై తాను తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగిందని తెలిపారు.
మీడియాలో తనపై కక్షపూరితంగా అసత్య ప్రచారం చేయిస్తున్నారని.. ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని చెప్పారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలన్నారు మల్లారెడ్డి. 2018 ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరఫున కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి పోటీ చేశారు. మల్లారెడ్డికి 167,324 ఓట్లు రాగా, లక్ష్మా రెడ్డికి 79,334 ఓట్లు వచ్చాయి.