కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత మల్లికార్జునఖర్గే సహా సీనియర్లు దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్, కమల్‌నాథ్,అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయొద్దని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, అలాంటి వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆవార్తలను తోసిపుచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీపై ఆయనను మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. వయసు రీత్యా సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు.
తన వయసు ఇప్పుడు 83 ఏళ్లని, కార్యకర్తలు పోటీచేయాల్సిందేనని పట్టుబడితే మాత్రం చెయ్యక తప్పదని అన్నారు. ఒకవేళ ఈ సారి ఎన్నికల్లో బరిలో దిగితే సొంత నియోజకవర్గం గుల్బర్గా నుంచే పోటీ చేస్తారా..? అని మీడియా ప్రశ్నించగా.. అధిష్ఠానం ఆదేశిస్తే తప్పకుండా చేస్తా అని బదులిచ్చారు. కొన్నిసార్లు పార్టీని ముందుండి నడిపిస్తే, మరికొన్ని సార్లు వెనక ఉండి నడిపించాల్సి ఉంటుందన్నారు.
తమకు అందిన జాబితాలో ఒకే స్థానం నుంచి పోటీకి పదేసిమంది రెడీగా ఉన్నారని ఖర్గే తెలిపారు. కాగా, ఖర్గే 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుల్బర్గా నుంచి ఎంపీగా పోటీకి దిగి గెలిపొందిన విషయం తెలిసిందే. అయితే 2019లో జరిగిన ఎన్నకల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలను సంప్రదించిన తర్వాతే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.