తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు . కానీ తొమ్మిదేండ్ల కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. బీఆర్ఎస్ (BRS) సర్కార్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ. 1.50 లక్షల అప్పు పడిందన్నారు. గతంలో తాము ఇచ్చిన ఎన్నో హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీ టీమ్ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. మోడీ సర్కార్ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని చెప్పారు. ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయిందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కానీ ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని గతంలో మోడీ చెప్పారన్నారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని గొప్పలు చెప్పుకున్నారని విమర్శలు గుప్పించారు.
కేసీఆర్, మోడీలు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఆ ఇద్దరూ ఇచ్చిన హామీలను మరిచి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మళ్లీ కాంగ్రెస్ సర్కార్ వస్తేనే దేశంలో నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పడుతాయన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఎన్నో జాతీయ సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ స్థాపించిన సంస్థలతో యువతకు భారీగా ఉద్యోగవకాశాలు కలిగాయన్నారు. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2500 వారి అకౌంట్లలో వేస్తామన్నారు.
వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్ గా ఇస్తామని ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సవాలుతో బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ పార్టీ అమలు చేస్తోందని తెలిపారు. అక్కడ ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ చూస్తానంటే బస్సు రెడీగా ఉందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండేదన్నారు. కానీ ఈ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. పదేండ్ల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని అన్నారు. దళితులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. పండిన పంటను కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నారు. మళ్లీ ఇప్పుడు సోనియాగాంధీ ఆదుకుంటే తప్ప తెలంగాణ బాగుపడే పరిస్థితి లేదన్నారు.