నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన ఆరోపణలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి(Mallu Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మతిస్థిమితం లేకుండా కాంగ్రెస్‌పై అవాకులు, చెవాకులు మాట్లాడారంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదనడం చూస్తుంటే ‘కళ్లుండి చూడలేని కబోదిలా.. చెవులుండీ వినలేని చెవిటివాడిలా’ ఉందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండోరోజే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసి మరో రెండు మంగళవారం చేవెళ్లలో అమలు చేయబోతున్నామని మల్లు రవి స్పష్టం చేశారు. అదేవిధంగా రూ.500 రూపాయలకు గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామన్నారు.
కోట్లాది మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. రేవంత్ రెడ్డిని ముందుగానే సీఎంగా ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30సీట్లు రాకపోయేవని కేటీఆర్ అనడం ఆయన దురంహకారానికి పరాకాష్ట అన్నారు.
అయితే, కాంగ్రెస్ ఆ ప్రకటనను ముందుగానే చేసి ఉంటే బీఆర్ఎస్కు మూడు సీట్లు కూడా వచ్చేవి కాదంటూ విమర్శించారు. కాం తమది కుటుంబ పార్టీ కాదన్న మల్లురవి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య యుతంగా విలువలతో కూడిన పాలన అందిస్తోందన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన వారితో సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదన్నారు.