ఎస్సీ డిక్లరేషన్ కు సంబంధించి పోరాటం చేస్తున్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ (Manda Krishna). ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఆమధ్య ప్రధాని మోడీ (PM Modi) వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు కలిసి.. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గీకరణ గురించి మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి రెండు రోజుల క్రితం గాంధీ భవన్ కు కూడా వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి మంద కృష్ణ బృందం గాంధీభవన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే (Manikrao Thakrey), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో పాటు పలువురు పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు మందకృష్ణ వినతిపత్రాలు ఇచ్చారు. అయితే.. తాజాగా దీనిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి గానీ, రేవంత్ రెడ్డికి గానీ చిత్తశుద్ది లేదన్నారు మందకృష్ణ. పార్లమెంట్ లో దీనిపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అవసరాల కోసం పార్టీలు మారే రేవంత్ రెడ్డికి.. ఎంఆర్పీఎస్ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. ఆయన పార్టీ మారతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కులతత్వవాది, అహంకారి అంటూ మండిపడ్డారు.
తన ఎదుగుదల కోసం రేవంత్ రెడ్డి ఏంతకైనా తెగిస్తారని.. ఆయన కన్నా పిట్టల దొర బెటరన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేత లెటర్ రాయమని అడిగితే ఇంతవరకు సమాధానం లేదని మండిపడ్డారు. ఎంపీగా బయట వేదికలపై మాట్లాడిన రేవంత్.. పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రెండు నిముషాలు మాట్లాడే ఓపిక లేని రేవంత్ తమను ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. మాదిగల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునే రేవంత్.. దళితులకు చేసిన ప్రయోజనాలు ఏమిటో చెప్పాలన్నారు.