తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచార (Election Campaign) పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. పోలింగ్‌కు కొద్ది గంటలే మిగిలి వుండటంతో ఈ సమయాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి మరి పార్టీలు ప్రలోభాలకు దిగుతున్నాయి.
డబ్బులతో ఓటర్లకు వల వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడా పలు పార్టీలకు చెందిన నేతలు పట్టుబడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టినట్టు తెలుస్తోంది. మందమర్రి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జయ రవీందర్ ఆధ్వర్యంలో డబ్బుల పంపిణీ చేశారు.
ఆ సమయంలో శ్రావణ్ అనే వ్యక్తి వారిని ఆపే ప్రయత్నం చేయగా అతనిపై బాల్క సుమన్ అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారని సమాచారం. ఈ క్రమంలో శ్రవణ్ పై బస్తీ వాసులను ఉసి గొల్పగా శ్రావణ్ ను బ్లూకోట్ పోలీసులు రక్షించారు.
ఇది ఇలా వుంటే గ్రామాలు , పట్టణాల్లో ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర తాయిలాలతో ప్రలోభ పెట్టి తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకునే పనిలో పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. మరోవైపు నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించడం అంతా చర్చించుకుంటున్నారు.