Manipur : మణిపూర్ అంశంపై మంగళవారం లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి. ఇటు అవిశ్వాసంపై కూడా వీరి ఆరోపణలు, ప్రత్యారోపణల నినాదాలతో సభ హోరెత్తిపోయింది. మొదట చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. (Gourav gogoi).. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ (Modi) సభకు వచ్చి ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్రానికి అఖిల పక్షాన్ని మోడీ తీసుకువెళ్లాలని, ఆయన అసలు విషయాలపై మాట్లాడకుండా విపక్ష కూటమి ‘ఇండియా’ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మణిపూర్ విషయంలో మోడీ మౌనంగా ఉంటున్నారని ఆరోపించిన ఆయన.. అదానీ ప్రస్తావన వచ్చినప్పుడు, సాగు చట్టాలపై రైతుల ఆందోళన సందర్భంలోనూ ఇలాగే వ్యవహరించారన్నారు. . చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించినప్పుడు, పుల్వామా దాడుల సందర్భంలోనూ మోడీ నోరెత్తలేదన్నారు. మణిపూర్ వీడియో బయటకి వచ్చాకే మోడీ మాట్లాడారు. ఘటన జరిగిన 80 రోజుల తరువాత నోరు విప్పారు.. అది కూడా అర నిముషం మాట్లాడారు అని గౌరవ్ గొగోయ్ అన్నారు.
ఆ రాష్ట్రంలో ఇంత జరిగినా అక్కడి ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించలేదని, అక్కడి హింసాత్మక ఘటనలపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చామని చెప్పారు. మణిపూర్ కు రాహుల్ గాంధీ,(Rahul Gandhi) ఇతర విపక్ష సభ్యులు వెళ్ళారని, కానీ మోడీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్ మంటల్లో తగులబడుతుంటే భారత్ తగులబడుతున్నట్టే అని వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చను రాహుల్ గాంధీ ఎందుకు ప్రారంభించలేదని బీజేపీ ఎంపీలు నిలదీశారు. అధికార, విపక్ష ఎంపీల నినాదాలతో సభ మొదట 12 గంటలవరకు వాయిదా పడింది. మళ్ళీ ప్రారంభం కాగానే బీజేపీ తరఫున మొదట మాట్లాడిన నిషికాంత్ దూబే.. పరువు నష్టం కేసులో రాహుల్ కి సుప్రీంకోర్టు కేవలం స్టే మాత్రమే ఇచ్చిందని, తీర్పు కాదని అన్నారు. మోడీ ఓబీసీ అయినందునే ఈ కేసులో రాహుల్ క్షమాపణ చెప్పడం లేదన్నారు. లోగడ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైలుకు పంపింది కాంగ్రెస్ కాదా ..మహారాష్ట్రలో పవార్ ప్రభుత్వాన్ని కూల్చింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరని, మణిపూర్ లో మాదకద్రవ్యాల మాఫియాను లోగడ కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు .. విపక్ష కూటమిపై మండిపడుతూ.. మీకు ప్రధాని మోడీ ప్రభుత్వ విజయాలు కనబడడం లేదన్నారు. మీ కూటమి పేరును కేవలం ఇండియా గా పేరు మార్చినంత మాత్రాన అది దేశ ప్రయోజనాలకు దోహదపడబోదని, మీరు భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంటే మీ కూటమి మరింత వెనక్కు వెళ్తుందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయాలో, ఏది చేయకూడదో విదేశీ శక్తులు చెప్పజాలవన్నారు.
ప్రస్తుతం ఏ విదేశీ శక్తి కూడా మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోజాలదని ఆయన వ్యాఖ్యానించారు. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. చంద్రయాన్-3 (Chandrayan-3) గురించి ఆయన ప్రస్తావిస్తూ మన అంతరిక్ష ప్రాజెక్టుల్లో మనతో కలిసి పని చేయడానికి అమెరికా కూడా ఆసక్తి చూపుతోందన్నారు. ఇక మణిపూర్ హింసను అదుపు చేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్ రాయ్ అన్నారు. ఆ రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. చివరకు పార్లమెంట్ ఉభయ సభలూ బుధవారానికి వాయిదా పడ్డాయి.