ప్రధాని మోడీ(PM Modi) కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో మూడు నెలలు పాటు రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్(Mann Ki Baat) నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక అదే ఏడాది అక్టోబర్ 3న విజయదశమి రోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై ప్రజలను ఉద్దేశించి తన మనసులోని మాటలను మోడీ పంచుకుంటూ వస్తున్నారు.
అయితే, ఇవాళ ప్రసారం అయిన కార్యక్రమం 110వ ఎపిసోడ్ కాగా ప్రధానిగా మోడీ రెండో టర్మ్‌లో ఇదే చివరి మన్ కీ బాత్ ప్రసంగం. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వచ్చే మూడు నెలల పాటు మన్ కీ బాత్ ప్రసారాలు ఉండవని మోడీ ప్రకటించారు. ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
‘మన్ కీ బాత్’ మూడు నెలల పాటు ఆగిపోవచ్చు. కానీ దేశం సాధించిన విజయాలు మాత్రం ఆగవు అని మోడీ తెలిపారు. మన్ కీ బాత్ హ్యాష్‌ట్యాగ్‌తో సమాజం, దేశం సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండాలని మన్ కీ బాత్ 110 ఎపిసోడ్‌లో మోడీ సూచించారు.