మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో విషాదం చోటు చేసుకొంది. మాజీ సీఎం మనోహర్ జోషి (86) (Manohar Joshi) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ముంబై పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.. జోషి మరణ వార్తను పీడీ హిందూజా హాస్పిటల్ (PD Hinduja Hospital) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాయ్ చక్రవర్తి ధృవీకరించారు.
గత కొంతకాలంగా వృద్యాప్య సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్న మానోహర్ జోషికి.. హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించారని వైద్యులు తెలిపారు. కాగా మెదడులో రక్తస్రావం కారణంగా 2023 మే నెలలో హాస్పిటల్‌లో చేరారు. అప్పటినుంచే ఆయన ఆరోగ్యం సరిగా లేదు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో పీడీ హిందుజా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిన్న సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా మనోహర్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో జరగనున్నాయని సమాచారం. ఇక జోషికి మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. కాగా ఈయన సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.