బ్రిటీష్ పాలనలో భారతీయులపై అనేకమైన దారుణాలు జరిగాయి. ఎదురు తిరిగిన వారిని దారుణంగా హింసించారు. చాలా ప్రాంతాల్లో భారతీయులను ఊచకోత కోశారు. ఇవి మనకు తెలిసిన కొన్ని ఘటనలు మాత్రమే. కానీ, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విష వాయువులపై ప్రయోగానికి భారతీయులను గినియా పిగ్స్ లాగా బ్రిటీష్ వాళ్లు వాడుకున్నారని చాలా మందికి తెలియదు. ఆ విషవాయువుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారనేది చరిత్ర గుర్తించని భయంకరమైన విషయం.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్లు రసాయన ఆయుధాలను ఉపయోగించారు. దీనివల్ల తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ క్రమంలో జర్మనీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు బ్రిటీష్ సాయుధ దళాలు క్లోరిన్, మస్టర్డ్ గ్యాస్, పాజ్ జీన్ వాయువులను ఉపయోగించాలని నిర్ణయించింది. దీని కోసం 1916లో ఇంగ్లండ్ లోని విల్ట్ షైర్ లోని సాలిస్ బరీకి సమీపంలో ఉన్న పోర్టన్ లో ‘వార్ డిపార్ట్మెంట్ ఎక్స్ పెరిమెంటల్ స్టేషన్’ను ఏర్పాటు చేశారు.
అప్పట్లో దీన్ని “పోర్టన్ డౌన్” అని పిలిచేవారు. ఇందులో పలు రకాల రసాయనాలను కెమికల్ ఏజెంట్స్ పై పరీక్షలు చేసేవారు. పాయిజన్ గ్యాస్ అనేది యూరోపియన్లతో పోలిస్తే ఇతర రంగు చర్మం గల వ్యక్తులపై ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా లేదో తెలుసుకునేందుకు బ్రిటీష్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు ప్రారంభించారు. ఈ పరీక్షల కోసం భారతీయులను గినియా పిగ్స్ మాదిరిగా వాడుకున్నారు.
యుద్ధ భూమిలో ప్రాణాంతకమైన విష వాయువును ఎంత మొత్తంలో వదిలితే శత్రువు మరణిస్తాడో గుర్తించేందుకు మొదట దాన్ని భారతీయులపై ప్రయోగాత్మకంగా ల్యాబ్ లో పరీక్షించారు. దీంతో చాలా మంది భారతీయులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి బారిన పడ్డారు. సుమారు 20 వేల మందికి పైగా మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులకు గురై తమ విలువైన జీవితాన్నికోల్పోయారు.