చత్తీస్‌గఢ్ (Chattisgarh) లో బస్తేర్ (Basther) జిల్లా అంటే మావోయిస్టుల కంచుకోట. ఇక్కడకు రావాలంటేనే అధికారులు వణికి పోతారు. ఇక పోలింగ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సారి బస్తేర్ జిల్లాలో 120 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నాలుుగు దశాబ్డాల తర్వాత బస్తేర్ జిల్లా ప్రజలు మొదటి సారి తమ సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికలను బహిష్కరించాలంటూ ఇటీవల మావోయిస్టు సంఘాలు పిలుపు నిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల నిర్వహణను ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 120 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అటు పోలీసులు సైతం ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
రాష్ట్రంలో నిర్వహించే మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బస్తేర్ డివిజన్ లోని ఏడు జిల్లాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బస్తేర్ డివిజన్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూసేందుకు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది భారీగా సెక్యూరిటీని భారీగా పెంచామని తెలిపారు.
గతంలో మావోయిస్టుల ప్రభావంతో కొన్ని గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించినట్టు చెప్పారు. ఈ సారి ఆయా గ్రామాల్లోనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.