కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు కుంగిన ఘటనపై మావోయిస్టులు (Maoists) లేఖ (Letter) రాయడం సంచలనంగా మారింది. మావోయిస్టు జేఎమ్ డబ్ల్యూసీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోయాయని లేఖలో పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ కుంగిపోడానికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టులు అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2016 మే 2వ మొదలు పెట్టారని, 21 జూన్ 2019న ఈ ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు.
ప్రాజెక్టు నిర్మించి కేవలం మూడేండ్లు మాత్రమే అవుతోందని వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలోనే బ్యారేజీ కూలి పోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని లేఖలో పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు చేశారు.
నిర్మాణ దశలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం బయటకు రానివ్వలేదన్నారు. ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను అడ్డుకున్నారని అన్నారు. ధర్నాలు, ర్యాలీలు చేయకుండా పోలీసు బలగాలతో అడ్డుకున్నారన్నారు. మీడియాను కూడా బెదిరింపులకు గురి చేశారన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలన్నారు.