జేడీయూ-బీజేపీ కూటమి (JDU-BJP Alliance) ఏర్పాటు విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో నూతనంగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ కూటమి ఎంతో కాలం ఉండబోదని తెలిపారు. 2025 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఈ కూటమి మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ-జేడీయూ కూటమి ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండబోదని వెల్లడించారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్, బీజేపీ అండదండలతో ఉనికిలోకి వచ్చిన ఈ కూటమి రాబోయే ఎన్నికల వరకు కూడా మనుగడ సాగించదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే మార్పు జరుగుతుందన్నారు.
కావాల్సిస్తే ఈ విషయాన్ని తాను రాసిస్తానని పేర్కొన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మహాఘట బంధన్2లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇస్తూ ఆయన ఎన్డీఏ పక్షం చేరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
నితీశ్ కుమార్ పై కాంగ్రెస్, ఆర్జేడీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నితీశ్ కుమార్ తరుచూ తన రాజకీయ భాగస్వాముల్ని మారుస్తూ ఉంటారని ఆరోపిస్తున్నాయి. రంగులు మార్చడంతో ఆయన ఊసరవెల్లతో పోటీ పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు.