నెలన్నర కిందట వివాహం జరిగిన నూతన వధువును ఆమె సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో చోటుచేసుకుంది. విషయమై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భాదోహికి చెందిన ఖుష్బూ బానో భదోహి అనే యువతి స్వచ్ఛందంగా ఇస్లాం మతాన్ని వీడి హిందూమతాన్ని స్వీకరించింది. ఖుష్బూ బానో తన పేరును ఖుష్బూ సక్సేనాగా మార్చుకుంది. తన మిగతా జీవితాన్ని హిందూగా జీవిస్తానని చెప్పింది. తనకు చిన్నప్పటి నుంచి హిందూ మతంపై నమ్మకం ఉందని, అయితే కొన్ని ఒత్తిళ్ల వల్ల మతం మారలేకపోయానని మత మార్పిడి సమయంలో చెప్పుకొచ్చింది.
అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం విశాల్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఆగస్ట్ నెలలో ముని ఆశ్రమంలో పండిట్ కేకే శంఖ్‌ధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన నెలన్నర లోపు ఆమెను ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఖుష్బూ కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయింది.
తన భార్యను కిడ్నాప్ చేశారంటూ విశాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని ఎస్పీ దేహత్‌కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. ఘటన జరిగిన సమయంలో తనతో పాటు, తన కుటుంబసభ్యులు ఇంట్లో లేరని పేర్కొన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో ఖుష్బూ తల్లిదండ్రులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.