హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈమధ్య హబ్సిగూడ చౌరస్తాలో దుస్తుల షోరూమ్ లో అగ్నిప్రమాదం (Fire Accident) జరగగా.. తాజాగా రాజేంద్రనగర్ (Rajendra Nagar) సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి (Mailardevpally) లోని టాటానగర్ లో మంటలు చెలరేగాయి. పరుపులు తయారు చేసే గోదాములో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మంటలను చూసి కార్మికులు బయటకు పరుగులు తీశారు. దటమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. చుట్టుపక్కల జనం కూడా భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Police) అగ్నిమాపక సిబ్బందితో కలిసి స్పాట్ కు చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ గోడౌన్ ఫాహిం అనే వ్యక్తిదిగా గుర్తించారు. ప్రమాదంతో దాదాపు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. బ్లాంకెట్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు వెయ్యి గజాల స్థలంలో ఈ గోదాము ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నగరంలో చాలా వరకు ఫైర్ సేప్టీ జాగ్రత్తలు లేకుండానే షాపులు, ఆఫీసులు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
సాధారణంగా వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం వానా కాలంలోనూ కలకలం రేపుతున్నాయి. దీనికి ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు అగ్నిమాపక సిబ్బంది.