పార్లమెంట్లో స్మోక్ అటాక్ ( Smoke Attack) ఘటనలో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా (Lalit Jha)పోలీసులకు లొంగిపోయాడు. ఘటన అనంతరం లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. తాజాగా ఢిల్లీ ‘కర్తవ్యపథ్’లోని పోలీసు స్టేషన్ కు వెళ్లి నిందితుడు సరెండర్ అయ్యాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు అతన్ని అధికారికంగా అరెస్టు చేసి స్పెషల్ సెల్ అధికారులకు అప్పగించారు.
ఘటన అనంతరం బస్సులో రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతానికి లలిత్ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ హోటల్లో ఉన్నారు. తన గురించి పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారని, తప్పించుకోలేనని తెలుసుకుని మహేష్ అనే స్నేహితునితో కలిసి పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడని వెల్లడించారు.
పార్లమెంట్లో బుధవారం స్మోక్ అటాక్ జరిగింది. లోక్ సభలో విజిటర్స్ గ్యాలరీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా సభలోకి దూసుకు వచ్చారు. కాసేపు గందరగోళం సృష్టించారు. సభలో స్మోక్ క్యాన్స్ విసిరి వేస్తుండగా ఎంపీలు దుండగులను పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ది చేసి వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఇద్దరు నిందితులను నిందితులను సాగర్, మనోరంజన్ గా గుర్తించారు.
మరోవైపు నీలమ్ దేవీ, అమోల్ షిండేలు పార్లమెంట్ బయట స్మోక్ క్యాన్స్ స్ప్రే చేస్తూ నిరసన ప్రదర్శనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలను లలిత్ ఝా తన సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోల తాలుకు కాపీలను ఓ ఎన్జీఓ సంస్థకు కూడా లలిత్ ఝా పంపాడని పోలీసులు చెబుతున్నారు.