2024 సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (Mayawati) ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్(Akash Anand) తన రాజకీయ వారసుడని వెల్లడించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నాహాల కోసం లక్నోలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యత కూడా ఆకాష్‌కు మాయావతి అప్పగించారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కుమారుడే ఆకాష్ ఆనంద్. 28 ఏళ్ల మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గత సంవత్సరం నుంచి బీఎస్పీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
2019లో సోదరుడు ఆనంద్ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా, జాతీయ కోఆర్డినేటర్‌గా మాయావతి నియమించారు.2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్ర, ఇటీవల డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.
అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పార్టీకి మాయావతి అధ్యక్షత వహిస్తారని బీఎస్పీ నేత ఉదయ్‌వీర్ సింగ్ తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ డానిష్ అలీని పార్టీ సస్పెండ్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను డానిష్ అలీ ఖండించారు.