బీఎస్పీ అధినేత్రి (BSP Chief) మాయావతి (Mayawati) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోవడం లేదని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. కానీ ఎన్నికల అనంతరం పొత్తులకు అవకాశం ఉందని తెలిపారు.
యూపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ తమకు లాభం కంటే ఎక్కువగా నష్టమే జరుగుతోందని మాయావతి పేర్కొన్నారు. ప్రతి సారీ తమ ఓట్లు ఇతరులకు బదిలీ అవుతున్నాయని చెప్పారు. అందువల్ల ఈ సారి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు.
బీజేపీ కులతత్వ, మతతత్వ రాజకీయాలను చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రజలు ఆ పార్టీని అధికారంలో చూడాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ద్వేషం వంటి రూపాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బీజేపీ పెద్ద ఎత్తున వాదనలు చేస్తోందని ఆమె అన్నారు.
అంతకు ముందు బీఎస్పీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకుంది. ఆ రెండు ఎన్నికల్లో ఇతరులకే లబ్ది జరిగిందే తప్ప బీఎస్పీకి ఎలాంటి లాభం చేకూరలేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.