పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి కోల్పోకుండా కాపాడుకోవడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.. అధికారంలో ఉన్నంత జోష్ లేకపోయినా.. తనదైన సెంటి మెంట్ తో ఓటర్లను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారని అనుకొంటున్నారు.. ఈ నేపథ్యంలో నేడు మెదక్, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సభను సుల్తాన్పూర్ (Sultanpur)లో నిర్వహించారు.
ఇందులో భాగంగా ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. మెదక్ (Medak) ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పోరాడి తెలంగాణ సాధించానని తెలిపారు.. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కు రెండు సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు.. ఈ ప్రభత్వం సంవత్సరం వరకు ఉంటుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు..
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీ (BJP)లో చేరబోతున్నట్లు తెలిసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ (KCR).. కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు డ్యూటీ చేయాలి కానీ అతి చేయవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సర్వే రిపోర్ట్లు చూసి రేవంత్ భయపడుతున్నారని విమర్శించారు.. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు..
ఎక్కడ పదవి ఊడుతుందో అనే భయంతో.. నారాయణపేట సభలో రేవంత్ వణికిపోయారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఏ మైండ్ తో ఉంటారో.. ఏ పార్టీలో చేరుతారో వారికే తెలియదని ఆరోపించిన కేసీఆర్.. ఈ అనుమానం కారణంగా రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని అన్నారు.. అలాగే బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమని ఎద్దేవా చేశారు..