దక్షిణ భారత కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-saralamma) జాతరకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గద్దెపై సారలమ్మ కొలువుదీరగా నేడు సమ్మక్క ఆగమనం జరిగింది. చిలుకలగుట్ట నుంచి సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. కోయ పూజారులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో మేడారం జాతరలో (Medaram Jatara) కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మరోవైపు సమ్మక్క రాక సందర్భంగా మేడారంలోని ఆమె గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆవరణ మొత్తం ఎర్రమన్నుతో అలికి, ముగ్గులు పెట్టారు. అమ్మవారికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా తల్లి గౌరవార్థం జిల్లా ఎస్పీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కోయలు ప్రత్యేక పూజలు, ఆటల పాటలతో స్వాగతం పలికారు. కాగా.. ఇప్పటికే సారమ్మను ఆదివాసీ పూజారులు కొమ్మ బూరలు ఊదుతూ, డోలు వాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు.
పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తైంది. సమక్క గద్దెపైకి చేరడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు రావడం పరిపాటిగా మారింది.
ఇక్కడికి వచ్చిన భక్తులు జంపన్న వాగు (Jampanna Vagu)లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను దర్శించుకొంటున్నారు. ఇప్పటికే గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గూడారాలతో నిండుకున్నాయి..